ఉల్లి ఘాటు

Tue,January 14, 2020 01:17 AM

-భగ్గుమన్న రిటైల్ ద్రవ్యోల్బణం
-డిసెంబర్‌లో ఐదున్నరేండ్ల గరిష్ఠానికి చేరిక
-7.35 శాతంగా నమోదు

న్యూఢిల్లీ, జనవరి 13:రిటైల్ ద్రవ్యోల్బణం భగ్గుమన్నది. గత నెల ఐదున్నరేండ్ల గరిష్ఠాన్ని తాకింది. రిజర్వ్ బ్యాంక్ ఆమోదయోగ్య స్థాయిని అధిగమించి డిసెంబర్‌లో ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. 2014 జూలైలో 7.39 శాతంగా ఉన్నది. కేంద్రంలో మోదీ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, మళ్లీ ఇన్నాళ్లకు ఇప్పుడే 7 శాతానికిపైగా చిల్లర ధరల సూచీ నమోదైంది. కూరగాయలు ముఖ్యంగా ఉల్లిగడ్డ ధరలు వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణానికి రెక్కలు తొడిగాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.100 తాకిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కిలో రూ.60 నుంచి 70 పలుకుతున్న సంగతీ విదితమే. కిలో కూరగాయల ధరలూ కనిష్ఠంగా రూ.20 నుంచి 80గా ఉన్నాయి. ఇవి చిల్లర ద్రవ్యోల్బణానికి ఒక్కసారిగా కోరల్ని తెచ్చిపెట్టాయి. సోమవారం విడుదలైన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వివరాల ప్రకారం కూరగాయల ధరలు అంతకుముందు డిసెంబర్‌తో పోల్చితే నిరుడు డిసెంబర్‌లో 60.5 శాతం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే 2018 డిసెంబర్‌లో 2.11 శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం.. 2019 డిసెంబర్‌లో 7.35 శాతానికి పెరిగింది. గతేడాది నవంబర్‌లో ఇది 5.54 శాతంగా ఉన్నది. ఇక ఈసారి స్థూల ఆహార ద్రవ్యోల్బణం 14.12 శాతంగా ఉంటే, పోయినసారి మైనస్ 2.65 శాతంగా ఉండటం గమనార్హం. నిరుడు నవంబర్‌లో 10.01 శాతంగా ఉన్నది. పప్పుధాన్యాలు తదితర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 15.44 శాతంగా ఉండగా, మాంసం, చేపల ధరల సూచీ సుమారు 10 శాతంగా ఉన్నది.

వడ్డీరేట్ల కోతలకు బ్రేక్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీరేట్ల కోతలకు ఇక బ్రేక్ పడినట్లే కనిపిస్తున్నది. వచ్చే నెల ఆరంభంలో ఈ ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను ఆర్బీఐ చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగనున్నది. ఈ క్రమంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరడంతో ఈసారి కూడా రెపో, రివర్స్ రెపో రేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్ష ముగిసే అవకాశాలున్నాయి. డిసెంబర్‌లోనూ ద్రవ్యోల్బణ భయాలతోనే వరుస వడ్డీరేట్ల కోతలకు ఆర్బీఐ విరామం ఇచ్చింది. వృద్ధిరేటు పురోగతి కోసం నిరుడు ఫిబ్రవరి నుంచి వరుస ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన సంగతి విదితమే. నిజానికి ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆర్బీఐ తప్పకుండా వడ్డీరేట్లను పెంచుతుంది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనం దృష్ట్యా ఆ చర్యకు సెంట్రల్ బ్యాంక్ దిగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి ద్రవ్యసమీక్షలోనూ రెపో, రివర్స్ రెపోల తగ్గింపు ఉండదని మెజారిటీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వడ్డింపులకూ ఆస్కారం ఉందని మరికొందరు అంచనా వేస్తున్నారు.
LIST

వృద్ధిరేటుకు దెబ్బ

దేశ జీడీపీని 2024కల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ ఈ లక్ష్య సాధనకు అడుగడుగునా అవరోధాలే ఏర్పడుతున్నాయి. కేంద్రం సంస్కరణలు, ఉద్దీపనలు ప్రకటించినా ఫలితం లేకుండా పోతున్నది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువనే ఉంచాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ స్థాయిలోనే ఉండటంతో గతంలో వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఈ పరిమితి దాటి ఇప్పుడు 8 శాతం దరిదాపుల్లోకి రావడంతో వడ్డీరేట్ల పెంపు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలూ చెప్పుకోదగ్గ స్థాయిలోనే వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే గృహ, వాహన రుణాలు మళ్లీ ప్రియం కావడం ఖాయం. దీనివల్ల వృద్ధిరేటు లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామిక సంఘం పీహెచ్‌డీ చాంబర్ కోరుతున్నది.

531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles