మార్కెట్లకు రేటింగ్ దెబ్బ

Sat,November 9, 2019 02:31 AM

-రికార్డు స్థాయి నుంచి వెనక్కి
-సెన్సెక్స్ 330, నిఫ్టీ 104 పాయింట్ల పతనం

ముంబై, నవంబర్ 8: రోజుకొక రికార్డులు బద్దలు కొడుతున్న స్టాక్ మార్కెట్లు తిరోగమన బాటపట్టాయి. దేశీయ రేటింగ్‌ను తగ్గిస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ దెబ్బకు మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. ఒక దశలో రికార్డు స్థాయికి చేరిన సూచీలు వెనువెంటనే మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడీస్ ఇచ్చిన నివేదికతో ఇన్వెస్టర్లు ఎగ్జిట్ బటన్ నొక్కారు. ఫలితంగా ఇంట్రాడేలో 40,749.33 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకిన సూచీలు చివరకు 330 పాయింట్లు నష్టంతో 40,323.61 వద్దకు జారుకున్నది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 103.90 పాయింట్ల నష్టంతో 11,908.15 వద్ద స్థిరపడింది. ప్రస్తుత వారంలో జరిగిన ఐదు సెషన్లలో మూడు రోజుల్లో సూచీ ఆల్‌టైం హైకీ చేరుకున్నాయి.

ఐదు నెలల తర్వాత 12 వేల మార్క్ దాటిన నిఫ్టీ దిగువకు పడిపోయింది. మొత్తంగా ఈ వారంలో సెన్సెక్స్ 158.58 పాయింట్లు, నిఫ్టీ 17.55 పాయింట్లు లాభపడ్డాయి. శుక్రవారం మార్కెట్లో సన్‌ఫార్మా, వేదాంతా, ఓఎన్‌జీసీ, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్‌లు నాలుగు శాతానికి పైగా నష్టపోగా..యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌లు మూడు శాతానికి పైగా లాభపడ్డాయి. భారత రేటింగ్ అవుట్‌లుక్‌ను తగ్గించింది. ఇప్పటి వరకు నిలకడగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ప్రతికూలానికి తగ్గిస్తున్నట్లు మూడీస్ ప్రకటించడం మదుపరుల్లో ఆందోళనను పెంచింది. గతంతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరికలు.. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్ అంచనావేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తున్నదని వ్యాఖ్యలు మార్కెట్ల పతనాన్ని శాసించాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

రూపాయి 31 పైసలు డౌన్

దేశీయ కరెన్సీకి మూడిస్ రేటింగ్ దెబ్బ తగిలింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకేరోజు 31 పైసలు పడిపోయి 71.28 వద్ద ముగిసింది. కరెన్సీకి గడిచిన మూడు వారాల్లో ఇదే కనిష్ఠ స్థాయి. 71.26 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఒక దశలో 71.33 స్థాయికి పడిపోగా..చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 31 పైసలు పడిపోయి 71.28 వద్ద స్థిరపడింది. అక్టోబర్ 16 తర్వాత మారకానికి ఇదే కనిష్ఠ స్థాయి ముగింపు. ఈవారంలో రూపాయికి భారీ చిల్లులు పడ్డాయి. గడిచిన ఐదు రోజుల్లో కరెన్సీ విలువ 47 పైసలు పడిపోయినట్లు అయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా ఒడిదుడుకులకు లోనుకావడం, డాలర్ మరింత బలోపేతం కావడం రూపాయి విలువ దిగజారిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర 1.91 శాతం తగ్గి 61.19 డాలర్ల వద్ద ముగిసింది.

రికార్డు స్థాయికి ఫారెక్స్ రిజర్వులు

విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నవంబర్ 1తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ రిజర్వులు 3.515 బిలియన్ డాలర్లు పెరిగి 446.098 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ 1.832 బిలియన్ డాలర్లు ఎగబాకి 442.583 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. విదేశీ మారకం రూపంలోవున్న ఆస్తుల విలువ 3.201 బిలియన్ డాలర్లు అధికమై 413.654 బిలియన్ డాలర్లకు చేరుకోగా..పసిడి రిజర్వులు మరో 301 మిలియన్ డాలర్లు పెరిగి 27.353 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది.

282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles