రేవతి


Sun,January 6, 2019 12:31 AM

REVATHI
ఆడపిల్లలంటే ఆడ పిల్లలనీ, పుట్టినింటికి పరాయి వారేననీ, వారు ఆడ పిల్లలవ్వాలంటే వారి వారి ఆస్థిత్వాన్ని కనుమరుగు చేసుకొని మరో ఇంటికి అస్థిత్వాన్నీ, నిండుదనాన్నీ సరైన రూపాన్నీ ఇవ్వగలరనీ. ఆడపిల్లే సృష్టికి ఆధారమైన, ఆరాధ్యమైన అమ్మకు అసలైన స్వరూపమనీ ప్రతీ ఒక్కరూ సమాజంలో భావించి తీరాలనే సంస్కారం భారతీయ సంస్కృతి నేర్పింది. ఈ భావన ఆడపిల్లలని తక్కువ చేసేది కాదు. ఆడ పిల్లలంటే అంతవరకే పరిమితమయ్యే ఆలోచనా కాదు. ఆడపిల్లలే ప్రతీ ఇంటికి ఇల్లనే రూపం. ప్రతీ బంధాన్ని అల్లే కుటుంబానికి పునాది, విశ్వమానవ సౌభ్రాతృత్వానికీ, సుసమాజ నిర్మాణానికీ అవసరమయ్యే వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే శక్తి.. ఇటువంటి అత్యున్నత స్థాయి ఆలోచనలు మాత్రమే ఆడపిల్లలను గౌరవించేందుకు తగిన సూచితార్థాలు. ఆడపిల్లను ఆడపిల్లగా పంపించడమంటే బరువు దించుకోవడమో, భారమైన బాధ్యతగా నిర్వర్తించడమో కాదు, తగిన వరుని కోసం తల్లిదండ్రులు ఎంతవరకైనా వెళ్ళగలరు రేవతి లాంటి ఆడపిల్లకోసమైతే బ్రహ్మలోకానికైనా చేరుకోవచ్చనీ, తండ్రి ఆలోచనలకు ప్రతిరూపమైన రేవతి ఆడపిల్లగా పుట్టినందుకు గర్వించిందనీ చెప్పవచ్చు. అపురూపమైన ఆడకూతురు రేవతి.

- ప్రమద్వర

మంచి భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణునికి వదినగా, కృష్ణుని అష్టభార్యలకూ తోడికోడలిగానే కాదు, మంచి బాధ్యతగల రాణిగా తన స్థానాన్ని స్థిరపరుచుకున్న రేవతి పాత్ర చాలా చిన్నదిగా కనిపించినా, ఆమెలోని పరిపక్వత అద్భుతం. రేవతి తనకూతురు శశిరేఖను కృష్ణుడు అభిమన్యుడికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నప్పుడు, బలరాముడు శశిరేఖను దుర్యోధనునికొడుకు లక్ష్మణ కుమారునికి ఇస్తానన్నప్పుడు తల్లిగా మదనపడింది.

సముద్రంలో నిర్మించబడిన కుశస్థలి అనే అద్భుత నగరాన్ని పాలించే కకుద్మి కూతురు రేవతి. బలరాముని పెళ్ళి చేసుకొని యదువంశానికి పెద్దకొడుకైంది. పుట్టినింటిలో రెట్టింపుగా పొందిన రేవతి, తాను ఆడ పిల్లలైనందుకు చాలా గర్వపడింది. అందమైన రూపం, అంతకంటే అపారమైన తెలివితేటలు, ఉన్నతమైన ఆలోచనలు నిలువెత్తు స్త్రీగా ప్రపంచానికి పరిచయమైంది రేవతి. కకుద్మికి కూతురు రేవతి అంటే చాలా ప్రేమ, గర్వం. తన జీవితం నిండు నూరేళ్ళూ సంతోషంగా గడవాలంటే మంచి వరునికిచ్చి మంచి కుటుంబంలోకి రేవతిని వివాహరూపంలో పంపించాలని ఎంతో తపించాడు కకుద్మి. ఎంతోమందిని వెదికాడు. చివరికి రేవతిని వెంటబెట్టుకొని బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. అక్కడ సభ జరుగుతుంది. కాసేపు వేచి చూశాడు. రేవతిని బ్రహ్మకు చూపి తనకు తగిన వరున్ని సూచించమని అర్థించాడు. బ్రహ్మ ఈ లోకంలో నీవు గడిపిన కొంతకాలం భూలోకంలో యుగాలు గడిచిపోయాయి. అయినా పర్వాలేదు రేవతి వంటి అమ్మాయికి యదువంశంలో జన్మించిన బలరాముడే తగిన వరుడు. నామాటగా బలరామునికి చెప్పి, రేవతిని బలరామునికిచ్చి పెళ్ళిచేయమని చెబుతాడు.

రేవతి తండ్రితో కలిసి బ్రహ్మలోకం నుంచి భువికి దిగివచ్చే సరికి మనుషులంతా యుగాలు గడిచి మరుగుజ్జులుగా కనిపించసాగారు. ద్వారకకు చేరి బలరాముని వెదుకుతుండగా మహాకాయులుగా వస్తున్న రేవతీ కకుద్ముల గురించి బలరామకృష్ణులకు సమాచారం అందుతుంది. వసుదేవాదులూ, బలరామకృష్ణులూ తమ వృత్తాంతాన్ని వినిపించి, బ్రహ్మమాటనూ తెలియపరిచారు. రేవతిని చూసి బలరాముడు తన నాగలితో ఆమె రూపాన్ని తనకు తగినంత ప్రమాణంలోకి మారుస్తాడు.
బలరామునితో రేవతి వివాహం చాలా గొప్పగా జరుగుతుంది. యదువంశంలోకి మంచిమనసున్న అమ్మాయి కోడలిగా అడుగుపెట్టిందని అందరూ సంతోషించారు. ఆమె ఆలోచనలు, తెలివితేటలు, బంధాలపై తనకున్న నమ్మకాలు యదువంశీయులనూ కలిసి ఉండేందుకూ, అందరూ ఆనందంగా ఉండేందుకూ ఉపయోగించిన రేవతి ఆదర్శ స్త్రీగా పేరు తెచ్చుకుంది. మంచి భార్యగా, తల్లిగా, శ్రీకృష్ణునికి వదినగా, కృష్ణుని అష్టభార్యలకూ తోడికోడలిగానే కాదు, మంచి బాధ్యతగల రాణిగా తన స్థానాన్ని స్థిరపరుచుకున్న రేవతి పాత్ర చాలా చిన్నదిగా కనిపించినా, ఆమెలోని పరిపక్వత అద్భుతం.

రేవతి తనకూతురు శశిరేఖను కృష్ణుడు అభిమన్యుడికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నప్పుడు, బలరాముడు శశిరేఖను దుర్యోధనునికొడుకు లక్ష్మణ కుమారునికి ఇస్తానన్నప్పుడు తల్లిగా మదనపడింది. అధర్మానికి తన కూతురెక్కడ బలైపోతుందేమోరననే తపన కృష్ణుడు తీసుకున్న నిర్ణయం తెలుసుకొని శశిరేఖ జీవితం బాగుపడుతుండడంతో చాల్లారింది. కురుక్షేత్రయుద్ధం జరుగుతుందని తెలుసుకొని ఒక్కటిగా ఉండాల్సిన కుటుంబం విడిపోయి వందలాది కుటుంబాలను చెల్లాచెదురు చేస్తాయని చింతించింది. ప్రతీ విషయంలోనూ పరోక్షంగా తన భావనలను చాలా సున్నితంగా అందరికీ చేరేలా ప్రయత్నించింది రేవతి.

రేవతి తన ముగ్గురు పిల్లలనూ, నిశద, ఉల్ముఖులనే కొడుకులనూ, కూతురు శశిరేఖనూ ఆదర్శవంతంగా పెంచి పెద్దచేసింది. యదువంశ వినాశంలో తన ఇద్దరు పుత్రులూ చనిపోగా విధిరాతని తలొంచింది. బలరామునితో సహగమనం చేసి తన ప్రస్థానం ముగించింది. అటు పుట్టినింటికీ, ఇటు మెట్టినింటికే కాదు ప్రపంచానికి ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని చెప్పకనే చెప్పింది.

212
Tags

More News

VIRAL NEWS