బ్రాండ్‌మ్యాన్.. మోహన్‌లాల్!


Sun,December 30, 2018 12:34 AM

goodwillambasador
నటుడిగా.. నిర్మాతగా, స్టార్ హోటల్ ఓనర్‌గా..పరిశ్రమలకు పెట్టుబడిదారుగా, సామాజిక సేవకుడిగా.. ప్రేరణనిచ్చే నాయకుడిగా, వాట్ నాట్ అన్నీ అతడే..మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌లో ఓ బ్రాండ్ మ్యాన్ ఉన్నాడు. అనేక ప్రభుత్వ పథకాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడమే కాదు.. తన వ్యాపారాలకు ఆయనే ఒక బ్రాండ్. ఆ మరో మనిషి గురించి తెలుసుకోండి.

- పసుపులేటి వెంకటేశ్వరరావు
ఫోన్: 8885797981

మోహన్‌లాల్ అసలు పేరు మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్. పాఠశాలలో చదివే సమయంలో నాటకాలలో పలు పాత్రలు పోషించాడు. మలయాళం, కన్నడం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 300లకుపైగా చిత్రాల్లో నటించాడు. మలయాళంలో చేసిన చిత్రాలు అక్కడి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనను మలయాళ సూపర్ స్టార్‌ను చేశాయి. 2016లో మోహన్‌లాల్ చేసిన జనతా గ్యారేజ్, కనుపాప(ఒప్పం), మన్యం పులి(పులి మురగన్), మనమంతా చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. పులిమురగన్ 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
goodwillambasador1

బాధ్యత.. స్వచ్ఛత

మోహన్‌లాల్ వృత్తి నటన, ప్రవృత్తి సమాజ సేవ. సామాజిక సేవా కార్యక్రమాలంటే ముందుంటాడు. సినిమా పాత్రల్లోనే కాదు నిజ జీవితంలోనూ సేవా కార్యక్రమాలు చేస్తూ తనలోని మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కేరళ ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా పని చేస్తూ తనవంతు బాధ్యతగా ఆ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాడు. 2007లో కేరళ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రారంభించిన అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఎయిడ్స్ పట్ల జనాలను చైతన్య పరచడానికి తీసిన పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాడు. కేరళ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కేరళ అథ్లెటిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. 2015లో కేరళ సర్కారు ఆధ్వర్యంలో ప్రజల్లో రోడ్డు భద్రత-ట్రాఫిక్ నియమ నిబంధనలపై చైతన్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన శుభయాత్ర కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉన్నాడు. కేరళ సర్కారు మృతసంజీవని పేరుతో అవయవదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా కూడా అవయవదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, కేరళ చేనేత పరిశ్రమకు ప్రచారకర్తగానే కాకుండా కేరళ రాష్ట్రంలోని పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రజలకు మంచి సందేశం ఇచ్చే వివిధ ప్రకటనల్లో మోహన్‌లాల్ నటించాడు, నటిస్తున్నాడు.

నాటి పౌరుడు.. దేశభక్తుడు

మోహన్‌లాల్ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ దేశభక్తుడు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన దేశ నాయకుల చిత్రపటాలు తన ఇంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తాడు. ఇదిలా ఉండగా మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ మోహన్‌లాల్ పలు చిత్రాలకు నిర్మాతగా పనిచేశాడు. 1915లో భారత స్వాతంత్య్ర సమరంలో ఆంగ్లేయుల చేతిలో బంధీలైన కొంతమంది దేశభక్తుల జైలు జీవితాల ఆధారంగా 1996లో వచ్చిన కాలాపానీ చిత్రాన్ని మోహన్‌లాల్ నిర్మించాడు. అప్పట్లోనే ఆ చిత్రాన్ని 2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. స్వాతంత్య్ర సమరయోధులు పడ్డ బాధలను, వారి దేశభక్తిని గురించి నేటితరానికి తెలియజేసేందుకు తీసిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. 1940నాటి నాటకరంగం ఎలా ఉందన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని వనప్రస్థానం సినిమాను నిర్మించడమే కాకుండా కథానాయకుడిగా కూడా చేశాడు.

లాల్ స్టోర్.. స్టార్ హోటల్

కేరళలోని కొచ్చిలో ద ట్రావెన్కోర్ కోర్ట్ పేరుతో 4 స్టార్ హోటల్ ఉన్నది. కోజికోడ్, పొనని, పత్నంతిట్ట, త్రిసూర్ పట్టణాల్లో మోహన్‌లాల్‌కు మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ బడ్స్ పేరుతో వివిధ రకాల మసాలా పౌడర్లను తయారు చేసే పరిశ్రమను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. టేస్ట్ బడ్స్ పేరుతో విక్రయించే ఉత్పత్తులన్నింటికీ బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. ఈక్విటీ ట్రేడింగ్ కంపెనీని స్థాపించి పెద్ద, మధ్యతరహా వ్యాపార సంస్థలకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నాడు. పలు చిత్రాల్లో తాను ధరించిన వెరైటీ కలెక్షన్‌తో పాటు పలురకాల వస్తువులను లాల్ స్టోర్ అనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా వేలం వేసి అమ్ముతాడు. వాటితో వచ్చిన డబ్బులో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయన రాసిన పుస్తకాలు, ఇతరులు రాసిన పుస్తకాలపై, టీషర్ట్స్‌లపై తన ఆటోగ్రాఫ్‌ను ముద్రించి అమ్ముతుంటాడు. లాల్ స్టోర్‌లో ఏ వస్తువు కొనుగోలు చేసినా పరోక్షంగా ఇతరులకు సాయం చేసినట్లే అంటాడు.
goodwillambasador2

అభయం.. ఆప్యాయం

పెద్దా చిన్నా, పేద ధనిక అనే తేడా అస్సలు చూపించడు మోహన్‌లాల్. అందర్నీ గౌరవిస్తుంటాడు. తన దగ్గర 28 యేండ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్న ఆంటోనీ పెరుంబవూర్‌ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు. తన వ్యాపార కార్యకలాపాలను ఆంటోనీకే అప్పగిస్తాడు. ఆంటోని 28 యేండ్ల కిందట ఓ షూటింగ్‌లో తన మిత్రుడి ద్వారా మోహన్‌లాల్‌కు పరిచయమయ్యాడు. తనను నమ్మిన వారికి ఏ అవసరం వచ్చినా అండగా నిలుస్తాడు. మోహన్‌లాల్ చిత్రాలకు తన డ్రైవర్ ఆంటోని నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు నమ్మకమైన మనుషులను ఎలా చూసుకుంటాడో చెప్పడానికి.

393
Tags

More News

VIRAL NEWS