నెట్టిల్లు


Sun,December 30, 2018 01:49 AM

జీవితంలో చేసిన తప్పులే అనుభవాలు. వాటిని సరిదిద్దుతూ మళ్లీ జరగకుండా చూసుకోవడమే జీవితం. చెబితే అంత సులువుగా ప్రజలకి అర్థమవుతుందా? చిన్న కథలో చూపిస్తే.. ఆ ఆలోచనతో వచ్చిందే షార్ట్‌ఫిలిం. అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపిస్తున్నది ఇప్పటి తరం. యూట్యూబ్‌ని వేదికగా చేసుకొని వారి డైరెక్షన్ విధానాన్ని అందరి ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రయత్నంలో వచ్చిన కొన్ని షార్ట్‌ఫిలింస్ ఈ వారం నెట్టింట్లో..

act-of-god

యాక్ట్ ఆఫ్ గాడ్

Total views 17,908+ (డిసెంబర్ 22 నాటికి)
Posted On : Dec 17, 2018
దర్శకత్వం: మణిరత్నం పెండ్యాల
నటీనటులు : రాజశేఖర్ అనింగి, మహి రాజ్‌పుత్, రేష్మ, కృష్ణ మాయ, శ్రీలక్ష్మీ, కుమారి
దేవుడంటే నమ్మకం లేని వల్లి తల్లి బలవంతంతో గుడికి వెళ్లింది. వల్లికి ఎంతో ఇష్టమైన డాక్టర్ భాస్కర్ పెండ్యాల తారసపడతాడు. దేవుడంటే ఇష్టంలేని అతను గుడికి ఎందుకు వచ్చారని ఆశ్చర్యంగా అడిగింది వల్లి. ఒక సంఘటన చెబుతాడు డాక్టర్. కథలోకి వెళ్లితే.. ఒక చిన్నపాపకి గుండె ఆపరేషన్ చెయ్యాలి. ఎలా అయినా బతికించమని డాక్టర్‌ని ప్రాధేయపడకుండా దేవుడి మీద బారం వేస్తారు పాప తల్లిదండ్రులు. ఆపరేషన్ చేసి బతికించాల్సింది నేనైతే దేవుడిని అడుగుతారేంటని ఆశ్చర్యంగా చేస్తాడు డాక్టర్. ఆపరేషన్ థియేటర్‌లోకి అడుగుపెడితే పాప కోరిక విని షాక్ అయ్యాడు. దేవుడనే వాడు గుండెల్లో ఉంటాడని. మీరు ఆపరేషన్ చేసేటప్పుడు గుండె కోస్తారు కదా? మీరు దేవుడ్ని చూసి ఎలా ఉన్నాడో నాకు చెప్పండని పాప డాక్టర్‌ని కోరింది. ఆపరేషన్ మొదలుపెట్టాడు. పాప తల్లిదండ్రులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. పాప పరిస్థితి చేయి దాటిపోయింది. పాప, తల్లిదండ్రులు దేవుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని బతికించమని మొదటిసారి డాక్టర్ దేవుడిని వేడుకుంటాడు. దేవుడి ఆజతో పాప
బతికిందా? జవాబు కావాలంటే షార్ట్‌ఫిలిం చూడండి.

rachatitha

రచయిత

Total views 6,228+ (డిసెంబర్ 22 నాటికి)
Posted On : Dec 18, 2018
దర్శకత్వం: అభినవ్ గంజి
నటీనటులు : అఖిల్ గంజి, ప్రణీత్ రెడ్డి కళ్లెం, మహేశ్ పవన్ యడ్లపల్లి, తాన్య చౌదరి, రాము చిక్కులపల్లి
వర్ణిక ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. కానీ తన కథనే ఆర్టికల్‌గా రాయాల్సివస్తుందని అసలు ఊహించదు. నిర్మల్‌రాజు అనే సినిమా డైరెక్టర్ కనిపించడం లేదని వర్ణికకి ఫోన్ వస్తుంది. అఖిల్ అనే అబ్బాయి కిడ్నాప్ చేశాడనీ, సోషల్‌మీడియా ద్వారా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలెడుతుంది వర్ణిక. ఈ క్రమంలో వందన్ అనే పోలీస్ కూడా కిడ్నాపర్స్ ఆచూకి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. వర్ణిక, వందన్, నిర్మల్ తమ్ముడు వరుణ్ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. అనుమానం ఉన్న అఖిల్‌ని రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటారు. అయినా ఎక్కడా అఖిల్ దొరకడు. చివరికి కిడ్నాప్ అయిన వ్యక్తి ఎక్కడున్నాడో, ఎవరు కిడ్నాప్ చేశారో కనిపెట్టలేక పోతారు. వచ్చిన గాసిప్స్‌ని నమ్మి ఒక అమాయకుడిని అనుమానించామని వర్ణిక, వందన్ బాధపడుతారు. ఈ ఉద్యోగానికి అర్హుడిని కాడని రిజైన్ చేస్తాడు వందన్. ఈ ఫీల్డ్‌లో ఎన్నో అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయకుండా చూసుకోవడమే జీవితం అని వందన్ బాస్ చెబుతాడు. అంతా బాగానే ఉంది మరి నిర్మల్‌రాజుని ఎవరు కిడ్నాప్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు. యూట్యూబ్‌లో చూసేయ్యండి మరి.

maro-prapancham

మరో ప్రపంచం

Total views 4,682+ (డిసెంబర్ 22 నాటికి)
Posted On : Dec 18, 2018
దర్శకత్వం: అభి కాటూరి
నటీనటులు : సుధా శేఖర్, అనూహ్య, శ్యామ్, రాజ్ చౌహాన్, సందీప్, చరణ్, నాయక్, లక్ష్మణ్
రోజూలాగే బస్ కోసం ఎదురుచూస్తుంటుంది శిరీష. చందు అనే అబ్బాయి కూడా బస్ కోసం ఎదురుచూస్తుంటాడు. పక్కన ఎవరో వచ్చారని ఎవరండి వచ్చింది అమ్మాయా.. అని అడుగుతాడు. చూసి కూడా అమ్మాయా అని అడుగడంతో శిరీషకి కోపం వస్తుంది. ఏంటి ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఏడిపిస్తున్నావని చుట్టు పక్కల ఉన్న కొందరు చందూని చితక్కొడతారు. కొంతసేపటి తరువాత చందూ ఫ్రెండ్ వచ్చి అతణ్ని చేతితో పట్టుకొని బండి మీద కూర్చోబెడుతాడు. అది చూసిన శిరీష తప్పు చేశానని బాధపడుతుంది. చందూ అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్తుంది. చందూకి క్షమాపణలు చెబుతుంది. ఇద్దరూ పరిచయం చేసుకుంటారు. చందూ మంచి ఆర్టిస్ట్. కళ్లు కనిపించక పోయినా స్పర్శని బట్టి వారి బొమ్మ గీయగలడు. మీరు ఒప్పుకుంటే మీ బొమ్మ గీస్తానని అడుగుతాడు. ఆమె ముఖం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి చేతితో ముఖం మీద తడుముతాడు. అచ్చు శిరీష ఎలా ఉందో అలానే పేపర్ మీద బొమ్మ వేస్తాడు. అతని మంచి మనసు చూసి చందూని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇద్దరూ ఒక్కటవుతారు. షార్ట్‌ఫలిం బాగుంది మీరు కూడా చూసేయండి.

sanju

సంజు B/O అంజు

Total views 3,492+ (డిసెంబర్ 22 నాటికి)
Posted On : Dec 19, 2018
దర్శకత్వం: ద్వారకానాథ్
నటీనటులు : ఆమని, ద్వారకాంత్, నిహారిక, ఫని, అభిరామ్, అనూష
సంజు, అంజు అన్నాచెల్లెళ్లు. ఇంజినీరింగ్‌లో చేరారు. అంజు ఇంజినీరింగ్ పూర్తి చేస్తుంది. సంజూ మాత్రం సబెక్టులు తప్పుతూనే ఉంటాడు. రిజల్ట్స్ వచ్చిన ప్రతీసారి తండ్రితో తిట్లు కామన్. నాలుగు సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. అంజు ఏదో విషయంలో సంజుని తండ్రి దగ్గర ఇరికిస్తూ ఉంటుంది. దాంతో సంజూకి కోసం వచ్చి అంజూ ముఖం మీద నీళ్లు కొట్టడం లాంటి పనులతో అల్లరి పెడుతుంటాడు. అంజూ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్లముందు సంజూ ఫోజ్‌లు కొట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు సంజూ తను ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం అంజు కంటపడింది. ఎవరా అమ్మాయి, నాన్నతో చెప్పమంటావా? అని ఆటపట్టింస్తుంది. దీంతో తన లవ్‌స్టోరీ చెబుతాడు సంజు. అంజూ సపోర్ట్ చేస్తుంది. కొన్నిరోజులకి అంజూకి పెళ్లి చేస్తారు. ఇంట్లో ఎప్పుడూ సందడి చేసే అంజూ లేకపోవడంతో సంజూ పరిస్థితి ఏంటి? అంజూ పెళ్లి ఎవరితో చేస్తారు? అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి చాలా సినిమాల్లో చూసినా కాస్త ఇంట్రెస్టింగ్‌గా చూపించారు ఇందులో.

- వనజ వనిపెంట

157
Tags

More News

VIRAL NEWS